హరిశ్చంద్రపురంలో రైల్వే హాల్ట్ ప్రారంభం

* ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. * హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ - గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు.

జనం న్యూస్, మార్చి, 21 కోటబొమ్మాళి మండలం: నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే రైల్వే హాల్టుల కోసం కృషి చేయడం జరిగిందని ఇందులో భాగంగానే సుదీర్ఘ కాలంగా నిరీక్షణలో ఉన్న ప్రతిపాదనలను కొలిక్కి తీసుకువచ్చే విధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సంప్రతింపులు జరిపి హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్ ను సాధించామని వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. హరిశ్చంద్రపురం వద్ద హాల్ట్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1996లో దివంగత నేత, అప్పటి కేంద్ర మంత్రివర్యులు కింజరాపు ఎర్రన్నాయుడు ఈ ప్రాంత రైల్వే సమస్యలపై వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గాను రూ. 602 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని అన్నారు.కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *