జనం న్యూస్ మార్చి 14 మోపిదేవి: మోపిదేవి మండలంలోని పెదప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థి, విద్యార్థినులకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. పెదప్రోలు గ్రామానికి చెందిన స్వర్గీయ కాకి శ్రీనివాసరావు జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు కాకి అశోక్ మరియు కాకి నాగలక్ష్మి తిరుపతమ్మ దంపతులు ఈ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. మోపిదేవి తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరినాథ్ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్స్‌లు, పెన్లు, పెన్సిల్లు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.