మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – రోడ్డు భద్రత, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జనం న్యూస్ 14-03-2026 రామగుండం మండలం ప్రతినిధి ప్రమోద్ కుమార్ వెంకటేష్ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పిల్లల భద్రత,“మత్తు పదార్థాల వినియోగం–అనర్థాలు”,సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పిల్లల భద్రత,“మత్తు పదార్థాల వినియోగం– అనర్థాలు”,సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పోలీస్ కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ,మత్తు పదార్థాలకు బానిసలైతే ఎవరి భవిష్యత్తైనా నాశనం అవుతుందని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని సూచించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని,ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని తమ ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమలో ఉన్న అపారమైన శక్తిని సరైన దిశలో వినియోగించుకోవాలని తెలిపారు. యువతలో సహజంగా ఉన్న ఉత్సాహం,శక్తిని క్రీడలు,చదువు మరియు సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ వయసులో శారీరకంగా, మానసికంగా ఎక్కువ శక్తి ఉంటుందని,ఆ శక్తిని మత్తు పదార్థాల వైపు మళ్లిస్తే ముందుగా ఆరోగ్యం దెబ్బతింటుందని, తరువాత జీవితమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా దూరం పెట్టాలని, ఎవరికైనా అలాంటి అలవాటు ఉన్నట్లు తెలిసితే ముందుగా వారిని మార్చే ప్రయత్నం చేయాలని, మార్పు రాకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మత్తు పదార్థాల అక్రమ రవాణా,వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువతలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.నివేదికల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం వరకు యువకులే బాధితులవుతున్నారని తెలిపారు.వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కారును నడిపే సమయంలో సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. ఎప్పుడూ రహదారి ఎడమ వైపునే ప్రయాణించాలని, భారీ వాహనాలను దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.సైబర్ నేరాల విషయంలో కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు అడగడం, అనుమానాస్పద లింకులు పంపడం వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.గతంలో తల్లిదండ్రులు అపరిచితులు ఇచ్చే చాక్లెట్‌లను తీసుకోవద్దని చెప్పేవారని,ఇప్పుడు అదే మోసం మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే లింకులు, మెసేజ్‌ల రూపంలో జరుగుతోందని వివరించారు.మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం సాధ్యమవుతున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరస్థులకు కూడా అవకాశం కలుగుతుందని చెప్పారు.అందువల్ల ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని,అప్రమత్తంగా ఉంటేనే నేరాల నుంచి రక్షణ పొందగలమని సూచించారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీస్ కళాబృందం పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వినియోగం–అనర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ప్రవచనకర్త ఎస్.పి. నాయక్ బంజారా, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐలు రమేష్, అనూష,పోలీస్ సిబ్బంది మరియు సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *