మట్టి దందా మోతఅభివృద్ధి పేరుతో మట్టి దోపిడి

ప్రశ్నిస్తే బెదిరింపుల పర్వం అధికారుల చర్యలపై ప్రజల ఆశ

జనం న్యూస్ మార్చ్ 14 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మట్టి దందా రోజురోజుకు హద్దులు దాటుతూ కొనసాగుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాల మాటున అక్రమంగా మట్టిని తవ్వి తరలించే కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు చెందిన భూముల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్న దృశ్యాలు మండలంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంట గ్రామ పరిసర ప్రాంతాలు, వినాయకపురం గ్రామ శివార్లలో మట్టి దందా జోరుగా సాగుతున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలు వరుసగా తిరుగుతూ మట్టిని తరలిస్తున్నప్పటికీ దీనిపై అధికారుల చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. అభివృద్ధి పనుల పేరుతో మట్టిని తీసుకెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదని స్థానికులు అంటున్నారు. మట్టి తవ్వకాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు, స్థానికులు పర్మిషన్ తీసుకున్నారా? అధికారుల అనుమతి ఉందా? అని అడిగితే మాటల దాడులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని చర్చ జరుగుతోంది. కొందరు “మా సొంత భూములు… మా ఇష్టం” అన్నట్టుగా మాట్లాడుతున్నారని కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే సొంత భూముల నుంచి కూడా మట్టిని తరలించాలంటే సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అనే విషయం చాలా మంది పట్టించుకోవడం లేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. నియమాలు ఉల్లంఘించి జరుగుతున్న ఈ మట్టి తవ్వకాల వల్ల భూముల స్వరూపం మారిపోతుందని, భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా మట్టి దందా కొనసాగుతుండటం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. పత్రికలు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే క్రమంలో వార్తలు ప్రచురిస్తే మాత్రం బెదిరింపులు, విమర్శలు ఎదురవుతున్నాయని జర్నలిస్టు వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మండల వ్యాప్తంగా జరుగుతున్న మట్టి దందాలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ కలిసి సమన్వయంతో చర్యలు తీసుకుంటే అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి మట్టి దందాను అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *