జనం న్యూస్, జనవరి 20 అల్లూరి జిల్లా, రిపోర్టర్ గోపి రెడ్డి : అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కేంద్రంలో గిరిజన మహిళలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మూడో రోజు చిన్నా,పెద్ద, ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులు అనే తేడా లేకుండా గ్రామస్తులంతా గిరిజన సంప్రదాయ నృత్యాలు, దింసా,కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు రోజులపాటు గ్రామమంతా పండుగ సందడితో కళకళలాడింది. ఇలాంటి పండుగలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడతాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే నాలుగో రోజు ఆదివారం పెదకోట గ్రామ కోలాట బృందం ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పెదకోట కోలాటం బృందం ఎంపీటీసీ ఎస్.శ్రావణి ఆధ్వర్యంలో ఒకే రకమైన చీరకట్టుతో కోలాటం ఆటను అద్భుతంగా గిరిజన మహిళలు ప్రదర్శించారు. గ్రామంలో ప్రతి ఏడాది గిరిజన సంప్రదాయ నృత్యం దింసాతో పాటు ఈ సంవత్సరం కోలాటం రావటంతో పిల్లలు,పెద్దలు, మహిళలు ఆసక్తిగా తిలకించారు.
