జనం న్యూస్ 20 జనవరి 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మొహమ్మద్ సమి : విద్యార్థులలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, ప్రాణాలను కాపాడటం, సురక్షితమైన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించి, ప్రమాదాలను అరికట్టాలనేది ప్రధాన లక్ష్యం అన్నారు పట్టణ సీఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు. జాతీయ రోడ్డు భద్రతా అరైవ్ లైవ్ – 2026 మాసోత్సవాల్లో భాగంగా సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతకు సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… విద్యార్థులు డ్రైవింగ్ చేసేట ప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వేగానికి సంబంధించిన ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాన్నారు. సీట్ బెల్టు, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం ఉండదన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసమే రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఈ సందర్బంగా విద్యార్థులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల వాహనాలు నడిపే వారు, రోడ్డుపై వెళ్లే వారు క్షేమంగా ఉంటారని చెప్పారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్. ప్రమాదాలను నివారించడంలో పోలీసులకు మద్దతు ఇస్తూ ట్రాఫిక్ యోధులుగా ప్రతిఒక్కరూ మారాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని గుర్తు చేశారు. రహదారి భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. సర్వేశ్వర రెడ్డి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పరమేశ్వర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జూనియర్ కాలేజీ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.