
జనం న్యూస్, మార్చి 22 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా గోరంట్ల పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షను ఆచరించిన భక్తులు శనివారం ఉదయం స్థానిక ఈద్గాలో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని పట్టణంలో ప్రత్యేక సందడి నెలకొంది. కొత్త దుస్తులు ధరించిన చిన్నారులు, యువకులు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. పేదలకు సహాయం చేయడం, జకాత్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వేడుకలలో మత పెద్దలు, ప్రముఖులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీఐ బోయ శేఖర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.