జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

జనం న్యూస్, మార్చి 15 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కెపిహెచ్‌బి కాలనీ 5వ ఫేజ్‌లో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తాళ్లూరి రాము, ప్రచార కమిటీ కార్యదర్శి ఆర్కే సాగర్, రాష్ట్ర నేతలు రాధారం రాజలింగం, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొన్నారు. నాయకులు, వీర మహిళల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ స్థాపించబడిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని పొందే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న విధానాలు పార్టీకి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయ కులు, గ్రేటర్ హైదరాబాద్ మరియు సైబరాబాద్ కార్పొరేషన్ పరిధి డివిజన్లకు చెందిన నాయకులు, వీర మహిళలు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.