జనం న్యూస్ మార్చ్ 15 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న శాసనసభ్యులు జారె ఆదినారాయణ శనివారం అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా ప్రజలతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యుత్ మరియు రహదారి సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా మొదటగా రెడ్డిగూడెం గ్రామపంచాయతీలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజన కుటుంబాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అర్హులైన గిరిజన లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలు గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆసుపాక మరియు కన్నాయిగూడెం గ్రామపంచాయతీల పరిధిలోని చెన్నాపురం గ్రామంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొత్తగా ఇళ్లను పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా నారాయణపురం, కోయరంగాపురం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఊట్లపల్లి గ్రామపంచాయతీలలో నిర్మించబోయే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో మట్టి రోడ్ల సమస్యలను పరిష్కరించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మార్గాలను కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి గ్రామాల రూపురేఖలను మార్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదుపరి కన్నాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సబ్‌స్టేషన్ పూర్తయితే పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడి రైతులకు మరియు గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫార్మర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో నిర్మించబోయే మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో మండల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కూడా ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. పనులు నిర్లక్ష్యంగా జరగకుండా పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. త్వరలో జరగనున్న చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారి సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా జరుగుతున్న పలు శుభకార్యాల్లో కూడా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. వివాహ వేడుకలు మరియు ఇతర కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు , అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ , ఎమ్మార్వో రామకృష్ణ , ఎంపీడీవో అప్పారావు ఎంపీఓ రామ కొండారెడ్డి , హౌసింగ్ ఏఈ మాధవన్ , పంచాయతీరాజ్ ఏఈ అస్మిత , విద్యుత్ శాఖ ఏడి వెంకటరత్నం , వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.