
జనం న్యూస్ 14 మార్చ్ ఘట్కేసర్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘సాప్ కోడ్ ఇన్నోవేషన్ 25-26’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సాప్ కోడ్ ఇన్నోవేషన్ రూమ్'ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తన విద్యార్థి జీవితంలోని ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. నేను మెడిసిన్ చదువుతున్న సమయంలో మా నాన్నగారు నన్ను ఒక ప్రైవేట్ కంపెనీలో పనికి పంపారు. నా పనితీరుపై మా నాన్న అడిగినప్పుడు ఆ యజమాని 'గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం' అని సమాధానమిచ్చారు. ఆ మాటతో నాకు అర్థమైంది, మనం ఏదైనా సాధించాలంటే స్వయంగా శ్రద్ధ వహించాలని. విద్యార్థులు కూడా ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త సాంకేతికతలను చూసి భయపడకుండా, వాటిని నేర్చుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థుల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని మంత్రి అభినందించారు. కళాశాల చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ రావడం సంతోషకరమన్నారు. గతంలో తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు మంత్రి తండ్రి వెంకటస్వామి గారి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వివిధ కళాశాలల నుండి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.