జనం న్యూస్ మార్చ్ 14 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం లో భాగంగా గాలి కుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన 8వ విడత ఎఫ్ఎండి టీకా కార్యక్రమం మహాదేవ్‌పూర్ మండలంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం 15 మార్చి 2026 నుండి 31 మార్చి 2026 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ అధికారి.మహాదేవ్‌పూర్ మండలంలోని సురారం, అన్నారం మరియు బ్రహ్మణపల్లి గ్రామాలలో జరుగుతున్న ఎఫ్ ఎం డి టీకా కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు. సూరారం గ్రామ సర్పంచ్ మరియు పశుపోషక రైతులతో మాట్లాడి కార్యక్రమంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పశువైద్య అధికారులకు మండలంలోని అన్ని అర్హమైన పశువులకు 100 శాతం టీకాలు వేయాలని, ఒక్క పశువు కూడా మిగలకుండా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమంలో సురారం, అన్నారం మరియు బ్రహ్మణపల్లి గ్రామాల్లో కలిపి మొత్తం 289 పశువులకు ఎఫ్ ఎం డి టీకాలు వేయబడగా, 62 మంది పశుపోషక రైతులు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా రైతులకు పశువుల ఆరోగ్య పరిరక్షణకు పచ్చి పశుగ్రాసం పెంచుకోవడం, వేసవి కాలంలో పశువులకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తాగునీటి సౌకర్యం కల్పించడం గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న నీటి ట్యాంకుల పరిస్థితిని కూడా పరిశీలించారు. తదుపరి సురారం మరియు అన్నారం ఉపకేంద్రాలను సందర్శించి భవనాల పరిస్థితి, పరిధిలో ఉన్న పశువుల జనాభా మరియు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. అలాగే అక్కడ పనిచేస్తున్న గోపాలమిత్రలు మరియు పశుమిత్రల కార్యకలాపాలను పరిశీలించి, పశువైద్య డాక్టర్ సూచనల మేరకు రైతులతో సమన్వయం కలిగి సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సూరారం గ్రామ సర్పంచ్ మేకల శంకరమ్మ మాట్లాడుతూ గ్రామంలో శుభ్రమైన పాలు ఉత్పత్తి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పశుసంవర్ధక శాఖ పథకాల సహాయం రైతులకు అందించాలని, అలాగే సురారం ఉపకేంద్రంలో చాలాకాలంగా ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గాలి కుంటు వ్యాధి లక్షణాలు పశువులకు జ్వరం రావడం, నోటి లోపల గాయాలు/పుడుచులు రావడం, కాళ్ల గిట్టెల వద్ద గాయాలు ఏర్పడటం, నోటి నుండి అధిక లాలాజలం కారడం, పాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ జరిగి రైతులకు ఆర్థిక నష్టం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుపతి, నాగభూషణం, లక్ష్మణ్, రాజబాబు, బానయ్య, రమేష్ మరియు సంతోష్ పాల్గొన్నారు