పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు

ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ - సురక్ష ప్రతినిధి

జనం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ : తేదీ: మార్చి 14, 2026. ఫ్యూచర్ సిటీ పరిధిలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదవ తరగతి (ఎస్ఎస్సి ) పరీక్షల కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఫ్యూచర్ సిటీ పరిధిలో సుమారు 15,764 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా సమయం ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పటిష్ట బందోబస్తు: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రశ్నపత్రాల భద్రత: పోలీస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే సమయంలో మరియు తిరిగి జవాబు పత్రాలను పంపే సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ బృందాలు రక్షణగా ఉంటాయి. నిషేధిత వస్తువులు: పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు, పెన్ డ్రైవ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడం పూర్తిగా నిషేధం.
సెక్షన్ 163 అమలు: పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరడాన్ని నిరోధించడానికి {బి న్ స్ స్} సెక్షన్ 163 (పూర్వపు 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. జెరాక్స్ సెంటర్లపై నిఘా: పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీయ్యాయి. పేపర్ లీకేజీ పుకార్లను అరికట్టడానికి స్పెషల్ స్క్వాడ్స్ మరియు ముఫ్తీ పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారు. ట్రాఫిక్ నియంత్రణ: విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అధికారులకు సూచనలు: మహేశ్వరం, షాద్ నగర్ మరియు చేవెళ్ల జోన్ల నుండి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అక్రమాలు లేదా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరడమైనది. కమిషనర్ ఆఫ్ పోలీస్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్