తెలుగు సాహిత్య ఆది కవయిత్రి మొల్లనీలకంఠం జయ రామకృష్ణ

ఘనంగా మొల్లమాంబ జయంతి.

జనం న్యూస్ మార్చి 14 మండలం పెన్ పహడ్ : తెలుగు సాహిత్య ఆదికవయిత్రి మొల్ల అని కుమ్మరి సంఘం నాయకులు నీలకంఠం జయరామకృష్ణ అన్నారు. తెలుగు తొలి మహిళా కవయిత్రి, మొల్ల రామాయణ సృష్టికర్త, ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు కుమ్మర సంఘం నాయకులు నీలకంఠం జయరామకృష్ణ ధరణి ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయరామకృష్ణ, కుల సంఘ నాయకులు మాట్లాడుతూ మొల్ల అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ అని, ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అని, ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందనీ అన్నారు. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలవారి కాలంలోని వారని చరిత్రలో లిఖించబడి ఉన్నదని పేర్కొన్నారు. కవయిత్రి మొల్ల రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందిందనీ, రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి మహిళా రచయిత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైనదని, రమణీయమైనదని అంటారు. మొల్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసనశెట్టి ఈమెను గారాబంగా పెంచారని ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టంతో ఆయనను వదిలివెళ్ళల్సి వస్తుందని వివాహం కూడా చేసుకోలేదని చరిత్ర చెబుతుంది. మొల్ల రామాయణం మొత్తం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని సాహిత్యకారులు చెబుతుంటారని అన్నారు. కుమ్మరి ఆడపడుచును స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం పలువురు కుమ్మరి మహిళలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధి దండ సునంద వెంకట్ రెడ్డి, నీలకంఠం వెంకటేశ్వర్లు వసంత, నీలకంఠం సత్యం సరస్వతి, చలిగంటి పుల్లారావు, నీలకంఠం మహేష్ శోభ, నీలకంఠం మంగమ్మ, నీలకంఠం సైదులు, సలిగంటి మధు తదితరులు పాల్గొన్నారు.