నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన సమావేశం

జనం న్యూస్ :21 జనవరి మాచారెడ్డి మండలం లక్మీరావులపల్లి గ్రామ పంచాయతీ గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ ఎం ఎన్ ఎఫ్) పథకం పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు రైతుల అవగాహన సమావేశం లక్ష్మీరావులపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం మరియు ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ డి రమేష్ మాచారెడ్డి ఎం ఏ ఓ పవన్ కుమార్, ఎం పి డి ఓ గోపి, ఎం పి ఓ,ఏఈఓ ప్రభాకర్, రవి,గ్రామ సర్పంచ్ హరిక, కృషి సఖీలు, బీఆర్‌సీ సభ్యులు మరియు గ్రామ రైతులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సహజ వ్యవసాయం ద్వారా రైతులు తక్కువ వ్యయంతో స్థిరమైన ఆదాయం సాధించవచ్చని, అలాగే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన మట్టిని అందించవచ్చని తెలిపారు. రైతులందరికీ నేల యొక్క ప్రాముఖ్యత ను వివరిస్తూ రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అందించడం జరిగింది.