జనం న్యూస్ 21 కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రి, ప్రోహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటకం మరియు సంస్కృతి శాఖల మంత్రివర్యులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మార్లవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్ ఆత్మీయతతో జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి ని మార్లవాయి గ్రామవాసులు మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామ అభివృద్ధికి చూపిన ప్రత్యేక చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసి ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ నివసించిన చారిత్రక ప్రాముఖ్యత గల మార్లవాయి గ్రామాన్ని మంత్రి ప్రత్యేకంగా సందర్శించి, పల్లె నిద్ర చేయడం ద్వారా గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సమైక్య ఆంధ్ర కాలంలో అన్యాయానికి గురై, గత పాలకుల నిర్లక్ష్యానికి లోనైన ఈ గ్రామానికి నేడు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి నాంది పలికినందుకు గ్రామపంచాయతీ తరఫున, గ్రామ ప్రజల తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కుంరం భీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కి ప్రత్యేక జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, గ్రామస్తులు ఆత్రం భగవత్ రావ్, సోయం రాజు, కనక భరత్, ఆడ సింగు, తొడసం సర్జబాయి, కొడప పూల్లబాయి, కనక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.