బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.సి ఐ టి యు

జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ రావు కార్మికులకు ,ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సిఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, పాత బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రాయితీలు కట్ట పెట్టిందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా,తక్కువ వేతనాలతో పనులు చేయించు కోవడానికి, సంఘటిత ,అసంఘటిత రంగ కార్మికులను మరింత దోపిడీ చేయడానికి, కార్మిక వర్గానికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా యజమానులకు స్వేచ్ఛనివ్వడానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేయడానికి ఉపయోగపడే లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు. కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ సంస్థల స్వలాభాల కోసం ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి,వికసిత్ బారత్ జి రాంజీ పథకం గా పేరు మార్చి రాష్ట్రాలపై భారాలను మోపి ప్రజల ఉపాధిని దెబ్బతీశారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విత్తన చట్టం రాష్ట్రాల పరిధిలో ఉందని, అయితే కేంద్రం జోక్యం చేసుకొని విత్తన చట్టానికి సవరణ చేసి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నదని విమర్శించారు. విత్తన చట్ట సవరణ వల్ల విదేశీ సంస్థలైన డూ పాయింట్ , కార్గిల్ సింజెంటా,బేయర్ లాంటి సంస్థలు 80% విత్తన రంగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నాయని విమర్శించారు. స్వదేశీ రైతుల పొట్టలు కొట్టి, విదేశీ బహుళ జాతి కంపెనీలకు ఎర్ర తివాచీపరచడమే దేశభక్తా అని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఆమోదించారని, దీని ప్రకారం ఇక నుండి విద్యుత్ ఉత్పత్తి ,సరఫరా, పంపిణీ బాధ్యతలను కేంద్రం చూస్తుందని విద్యుత్ చార్జీలను కేంద్రమే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నిర్ణయిస్తుందని తెలిపారు. విదేశాల నుండి విద్యుత్ ని దిగుమతి చేసుకోవడానికి అనుమతినిస్తూ రాష్ట్రల హక్కులను హరించారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలకు కల్పించిన రాజ్యాంగబద్ధహక్కులను తన ఆధీనంలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ఆదాని వంటి కార్పొరేట్ శక్తులకు విద్యుత్ రంగ సంస్థలకు అప్పగించి వినియోగదారులపై విద్యుత్ భారాల మోపారని విమర్శించారు. మన ఇన్సూరెన్స్ రంగాన్ని విదేశీ బహుళ జాతి కంపెనీలకు అప్పగించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలను పర్యావరణాన్ని దెబ్బతీసే అణు బిల్లును కూడా ఆమోదించారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను ఆహ్వానించే నిర్ణయం వల్ల రిజర్వేషన్లు రద్దయి ప్రభుత్వ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపాధి చూపలేక ,నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టలేక విద్వేష విభజన రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్ర బిజెపి తక్షణమే లేబర్ కోడ్ లను రద్దుచేసి, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, విత్తన,విద్యుత్ సవరణలు రద్దు చేసే వరకు జరిగే పోరాటాలలో కార్మికులు ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ,నాయకులు బాలకృష్ణ, రామాంజనేయులు, భాస్కర్, పరమేష్, రఘు, రామాంజనేయులు, విష్ణు, రామకృష్ణ,నరేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా