పిట్లం లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా ముగింపు

జనం న్యూస్ జనవరి 20 పిట్లం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2026 కార్యక్రమంలో భాగంగా, పిట్లం మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ ఉత్సాహభరితంగా, ఘనంగా ముగిసింది. ఈ ర్యాలీలో ఎంఆర్ఓ, ఎంఈఓ, స్థానిక గ్రామ సర్పంచ్, ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతి నిధులు, నాయకులు, యువత, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, సీఎం కప్–2026 కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువ క్రీడాకారులకు విశాలమైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యువత క్రీడల వైపు ఆకర్షితులై ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.అనంతరం మాట్లాడిన స్థానిక సర్పంచ్ కుమ్మరి శేఖర్ మాట్లాడుతూ,పిట్లం మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు తప్పనిసరిగా సీఎం కప్–2026లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ క్రీడా పోటీలు యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడమే కాకుండా, ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. చివరిగా ఎంపీడీవో మండలంలోని యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సీఎం కప్–2026లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు.