పాడి రైతులకు ఉచిత పశువైద్య శిబిరాలు

★1962 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సంచార పశువైద్య వాహనాల సేవలు

జనం న్యూస్ జనం 20 కోటబొమ్మాలి మండలం :పశువుల ఆరోగ్యం – పాడి రైతుల సౌభాగ్యం’ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం కోటబొమ్మాలి మండలం ఉడికలపాడు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజిరాపు హరివర ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.రైతులు, పశుపోషకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు (మొత్తం 13 రోజులపాటు) రాష్ట్రవ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పశువులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.ఈ శిబిరాల్లో జ్వరాలు, జీర్ణ సమస్యలు, గాయాలకు చికిత్సలతో పాటు పరాన్న జీవుల నియంత్రణకు డీ–వార్మింగ్, అంటువ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. అలాగే పాల ఉత్పత్తి, పోషణ, పశుసంరక్షణ అంశాలపై నిపుణులైన పశువైద్యులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.పశువుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాల దిగుబడి, ఎదుగుదల, ఉత్పాదకత పెరుగుతాయని అధికారులు తెలిపారు. పశువుల అకాల మరణంతో రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పశుభీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు భీమా వర్తిస్తుందని తెలిపారు. భీమా ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వం భరిస్తే, రైతులు కేవలం 15 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఒక రైతుకు గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలు, 100 గొర్రెలు లేదా మేకలు, 50 పందులకు భీమా సౌకర్యం కల్పించారు.పాల ఉత్పత్తి పెంపునకు శాస్త్రీయ విధానంలో లింగ నిర్ధారణ వీర్యంతో పాటు మెరుగైన జాతి ఆబోతుల వీర్యకణాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా రూ.1,800 ధర ఉన్న లింగ నిర్ధారణ వీర్యాన్ని రైతులకు కేవలం రూ.150కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు.టెక్కలి నియోజకవర్గానికి రెండు సంచార పశువైద్య వాహనాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఒక వాహనం నిర్దేశిత గ్రామాలను సందర్శించి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్సలు అందించనుండగా, మరో వాహనం అత్యవసర పరిస్థితుల్లో పశువులను వైద్యుల వద్దకు తరలించేందుకు ఉపయోగించనున్నారు. ఈ సేవల కోసం రైతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మండలం లోని అన్ని గ్రామాలు, అన్ని పంచాయతీల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల రైతులు పశువులను ఆసుపత్రులకు తీసుకువెళ్లే ఇబ్బంది లేకుండా నిపుణులైన వైద్యులు నేరుగా రైతుల వద్దకే సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మండల అధ్యక్షులు బోయిన రమేష్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, నంబాల పద్మా శ్రీనివాసరావు, పట్ట సింహాచలం, పూజారి శైలజ, రావాడ రాజేష్, నాళ్ల ఆది నారాయణ (చిన్ని), శిమ్మ సింహాచలం తదితర మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అలాగే డాక్టర్ కంచారాన రాజగోపాలరావు (సంయుక్త సంచాలకులు), డాక్టర్ చందక నరసింహులు (టెక్కలి ఉప సంచాలకులు), డాక్టర్ మంద లోకనాథం (కోటబొమ్మాలి సహాయ సంచాలకులు), డాక్టర్ ఆర్. కిషోర్ (పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల), డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ప్రజ్ఞ చైతన్య, డాక్టర్ శిరీష, డాక్టర్ దివ్య, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ జి. గంగరాజు రాజేష్, సంచార వాహన సిబ్బంది రోహిత్, నరేంద్రలు పాల్గొన్నారు.మండలంలోని వివిధ రైతు సేవా కేంద్రాల పశుసంవర్ధక సహాయకులు, సిబ్బంది, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అక్కయవలస, నిమ్మాడ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం మండలంలో 3,200కు పైగా గొర్రెలు, మేకలకు, 462 పశువులకు నట్టల నివారణ మందులు అందించగా, 24 గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసినట్లు అధికారులు తెలిపారు.