జనం న్యూస్, జనవరి 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ సోమవారం జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో డిస్ప్లే బోర్డు సరిగా పనిచేయకపోవడంతో సోమవారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం వచ్చే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17234) కు సంబంధించిన డిస్ప్లే బోర్డు ప్రకటన ఇవ్వకపోవడంతో చాలామంది ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. అర్ధరాత్రి వచ్చిన దక్షన్ ఎక్స్‌ప్రెస్ (12722) డిస్ప్లే బోర్డును తొలగించకుండా అలాగే ఉంచడంతో, అదే రైలు మళ్లీ వస్తుందని అనేక మంది భావించారు. పండుగ సందర్భంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో గందరగోళం మరింత పెరిగింది. దక్షన్ ఎక్స్‌ప్రెస్ డిస్ప్లేనే కొనసాగుతుండటంతో, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటికీ చాలామంది ప్రయాణికులు రైలు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఉండిపోయారు. ఈ విషయమై ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా,అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. టికెట్లు జారీ చేసే అధికారిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.డిస్ప్లే బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ,ఈ ఘటనపై పలువురు సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
