ఘనంగా మొదలైన సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర.

★హాజరైన సినీ నటుడు శివాజీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు. ★శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

జనం న్యూస్ 20 జనవరి 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మొహమ్మద్ సమి : గతంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు విపరీతంగా చలించిన ఆయన చంద్రబాబు క్షేమంగా బయటికి వస్తే తన గడప నుంచి వెంకన్న గడప దాకా వస్తానని ఆ ఏడుకొండలవాడికి మొక్కుకున్నాడు.. ఆ క్రమంలోనే సంకల్ప యాత్ర పేరిట రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన సొంత పరమేశ్వర థియేటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు సినీ నటుడు శివాజీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారీ ఎత్తున హాజరైన అభిమానుల మధ్య ఆయన పాదయాత్ర విజయవంతంగా మొదలైంది. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ యాత్ర కాదు, సంకల్ప యాత్ర. తాను చేస్తున్నది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పష్టతనిచ్చారు. సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొక్కుకున్న తీరుగా తన గడప నుంచి ఆయన గడపకు పాదయాత్ర చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఒకరోజు తెల్లవారుజామున లేవగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్న వార్త విని చలించిపోయానని, ఆయనను ఎప్పుడూ విడుదల చేస్తారని ఎదురు చూశానని ఆయన అన్నారు. 42 రోజులు గడుస్తున్న చంద్రబాబు నాయుడు బయటికి రాకపోవడం చూసి తాను చాలా భయపడ్డానని, ఆయన క్షేమంగా వస్తారా లేదా అని అనుమానించానని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టును దారుణంగా పరిగణించి ఉద్యమం మొదలు పెట్టానని, రోజు ఢిల్లీకి వెళ్లి కూర్చునేవాడినని గుర్తు చేశారు. తన మిత్రుడు నటుడు శివాజీతో కూడా ఎప్పుడూ ఇదే అంశంపై చర్చించేవాడినని వెల్లడించారు. మనలాంటి వాళ్ళ ఎందరికో బతుకిచ్చిన చంద్రబాబును విడుదల చేసేదాకా పోరాటం ఆపకూడదని ఒక జట్టును తయారుచేసి పోరాటాన్ని మొదలుపెట్టామని అన్నారు. చంద్రబాబు బయటికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడో నని భయపడ్డామని, కానీ జూలు విడిచిన సింహంలా, తెలుగువారి గర్వంలా, తెలుగువారి తేజంలా ఆయన బయటికి రావడం చూసి చాలా సంతోషపడ్డామని ఆయన అన్నారు. తాను సినీ నటుడిని కావాలన్న సంకల్పంతో వెళ్లినప్పుడు మొదటిసారిగా చిరంజీవిని చూశానని ప్రస్తుతం ఆయన సినిమా ఆడుతున్న సమయంలోనే ఈ యాత్ర చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తన యాత్రకు సహకరిస్తూ తన వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.