జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులే మూలస్తంభాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై గ్రామ సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం సర్పంచులకే ఉంటుందని, అందువల్ల అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలంటే వారి కృషి అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, గ్రామపంచాయతీలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.