గిరిజనేతరుల అక్రమ కట్టడాలను నిలుపుదల చేయండి

*ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా *బుట్టాయిగూడెం రెవెన్యూ సర్వే నెంబర్ 542/2లో అక్రమ కట్టడాలు *గిరిజనేతరులు అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం చట్ట విరుద్ధం

జనం న్యూస్ 20 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ : సోమరాజు నడపాల గిరిజనేతరుల అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను ఆపాలని ధర్నా నిర్వహించారు. అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలని,గిరిజన భూములు కాపాడాలని,ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను అమలు చేయాలని, గిరిజనులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్, గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షులు కూరం సత్యనారాయణ లు మాట్లాడుతూ బుట్టాయగూడెం మండల కేంద్రం పరిధిలోని శివాలయం సమీపంలో సర్వే నెంబర్ 542/2లో ఏజెన్సీ ఏరియా గిరిజన చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ కట్టడాలు గిరిజనుల జీవనాధారాలపై తీవ్ర దాడిగా మారాయన్నారు. ఈ భూమిపై గత రెండు సంవత్సరాలనుండి కట్టడాలు చేయొద్దని గిరిజన సంఘం అభ్యంతరాలు వినతులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఐటీడిఎ కోటరామచంద్రపురం ప్రాజెక్టు అధికారి వారి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా గిరిజనేతరులు యదేచ్చగా అక్రమ కట్టడాలు చేపట్టడం గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరులు అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం పూర్తిగా చట్ట విరుద్ధం అయినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ నిర్మాణాలు నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని విమర్శలు చేశారు.ఈ అక్రమ కట్టడాల వల్ల కేవలం భూమి సమస్య మాత్రమే కాదని ఇది ఆదివాసీల హక్కులు, జీవన విధానంపై దాడులు పెరిగాయాన్నారు.గిరిజనుల కోసం ప్రభుత్వం చేసిన చట్టాలు అధికారుల నిర్లక్ష్యం తో నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు.షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన భూముల రక్షణ కోసం ఉన్నప్పటికీ, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాలోని అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని గిరిజనుల భూములకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే,గిరిజన సంఘాలు ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ ఐ కె గంగరాజు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యం శ్రీదేవి,ఇ అన్నపూర్ణ, యం అనూష, కె దుర్గారావు, పి వెంకటేష్, పి రోజ, సూర్యకాంతం, బులి వెంకమ్మ, యం దేవి,శంకురమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *